ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తన పాలనకు ఏడాది పూర్తయ్యిన సందర్భంగా జూన్ 12న ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతుంది. ఈ సందర్భంగా “తల్లికి వందనం” (Thalliki Vandanam ) మరియు “అన్నదాత సుఖీభవ” (Annadata Sukhibhava ) అనే రెండు ప్రధాన పథకాలను మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు, తల్లుల ప్రోత్సాహాన్ని పెంపొందించేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం.
మూడవ విడతల్లో మొత్తం రూ.20,000 సహాయం
ఇక రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో మూడవ విడతల్లో మొత్తం రూ.20,000 సహాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా పంటల పెట్టుబడుల భారాన్ని తగ్గిస్తూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అంకితభావంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు వ్యవసాయాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అచ్చెన్నాయుడు తెలిపారు.
లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు
అదే రోజున మరో ముఖ్యమైన పథకంగా, లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకం ద్వారా సామాజికంగా వెనుకబడి ఉన్న మహిళలకు భద్రతా కవచం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రతి నెలా అమలయ్యే సంక్షేమ పథకాల వివరాలతో పాటు ఏడాది మొత్తం కోసం సంక్షేమ క్యాలెండర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
Read Also : War : చైనా, పాకిస్థాన్.. మీ బుద్ధులు మారవా?