భారత్ – పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు సంతరించుకున్నాయి. సరిహద్దు ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలు, కాల్పుల విరమణ ఉల్లంఘనల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ అలెర్ట్ తక్షణమే అమల్లోకి వచ్చింది.

ప్రజల కు సూచనలు
ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అయినప్పటికీ రెడ్ అలెర్ట్ కొనసాగుతోందని, రెడ్ అలెర్ట్కు సూచనగా సైరన్లు మోగుతాయని, ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని, కిటికీల వద్దకు కూడా వెళ్లవద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
ప్రజల అవసరాల దృష్ట్యా విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు తెలిపారు. అయితే, దీనిని చూసి భద్రతా పరిస్థితులు మెరుగయ్యాయని భావించకూడదని, రెడ్ అలెర్ట్ యధాతధంగా కొనసాగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. అధికారులు ఇచ్చే తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ప్రజలంతా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తెల్లవారుజామునే సూచనలు
అంతకుముందు, తెల్లవారుజామున 4:39 గంటలకు కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇళ్లలో లైట్లు ఆర్పివేయాలని, కిటికీలు, రోడ్లు, బాల్కనీలు లేదా టెర్రస్ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు పునఃప్రారంభించవచ్చో తెలియజేస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అనుమానిత కార్యకలాపాలు, డ్రోన్ సంచారాలపై కఠినంగా స్పందిస్తోంది. పాకిస్థాన్ వైపు నుండి వచ్చిన కొన్ని డ్రోన్లను గుర్తించి అడ్డుకున్నట్లు రక్షణ వర్గాలు తెలియజేశాయి.
Read also: Operation Sindoor: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్సై వీరమరణం