పాకిస్తాన్‌పై ప్రతీకార యుద్ధానికి దిగింది భారత్. జమ్మూ కాశ్మీర్ (Jammu kashmir) లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్ చేపట్టింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడింది. భారత్ మిస్సైళ్ల దాడులతో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. లాహోర్, సియాల్ కోట్ వంటి నగరాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ప్రత్యేకించి- సియాల్ కోట్. దాదాపుగా ఏడున్నర లక్షల మంది వరకు జనాభా ఉండే ఈ సిటీ ఖాళీ అవుతోంది.
ఇజ్రాయెల్ స్పందన: భారత్‌కు సంపూర్ణ మద్దతు
తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్ (Jammu kashmir)పై భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది. మొత్తంగా ఎనిమిది మిస్సైళ్లను ప్రయోగించగా.. వాటన్నింటినీ కూడా భారత ఆర్మీ మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ అయింది. వాటిని కూల్చివేసింది. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులపై నేరుగా అటాక్ చేసింది భారత్. వాటన్నింటినీ ధ్వంసం చేసింది. నామరూపాల్లేకుండా నేలమట్టం చేసి పడేసింది. సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ పదే పదే మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగడం పట్ల ప్రతీకారాన్ని తీర్చుకుంది. భారత్ చేపట్టిన ఈ సైనిక చర్య పట్ల ఇజ్రాయెల్ హర్షం వ్యక్తం చేసింది. దీన్ని స్వాగతించింది. ఉగ్రవాదాన్ని అణచివేయాలని భారత్‌ను కోరింది. ఈ యుద్ధంలో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తామని పేర్కొంది.

ఈ యుద్ధంపై జోక్యం చేసుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. యుద్ధం ఆరంభమైనప్పుడు తామేమీ చేయలేమని తేల్చి చెప్పింది. వార్ మొదలు కావడానికి ముందే భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను నివారించడానికి చేయాల్సిందంతగా చేశామని పేర్కొంది. ఇందులో పాల్గొనడానికీ అయిష్టత చూపింది. పాకిస్తాన్‌కు మిత్రదేశంగా గుర్తింపు పొందిన చైనా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈ యుద్ధం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించింది. ఉద్రిక్తతలను తగ్గించే విషయంలో అంతర్జాతీయ దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
చైనా స్పందన: శాంతికి మద్దతు, సంయమనం పాటించాలి
భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న తాజా పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ (lin jian) అన్నారు. భారత్- పాకిస్తాన్ ఎప్పుడూ పరస్పరం సహకరించుకోవాలని, శాశ్వతంగా పొరుగు దేశంగా కొనసాగాల్సి ఉంటుందని, ఇవి రెండూ కూడా తమకూ పొరుగు దేశాలేనని గుర్తు చేశారు. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఉపఖండంలో శాంతి, సుస్థిరత, విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ రెండు దేశాలను లిన్ జియాన్ (lin jian) కోరారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ సహా అంతర్జాతీయ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంతంగా ఉండాలని, సంయమనం పాటించాలని భారత్- పాక్‌లకు విజ్ఞప్తి చేశారు.