చాలా మందికి సహజంగానే అప్పుడప్పుడు దంతాల, చిగుళ్ల నొప్పి వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దంతాలు పుచ్చిపోయి అందులోకి ఆహార పదార్థాలు వెళ్లడం, చిగుళ్ల వాపులు రావడం, ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉండడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వంటి కారణాల వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పి వస్తుంటాయి. అయితే ఇందుకు పలు ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు, ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా మారుతాయి. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు, లవంగాలతో ఉపశమనం
దంతాలు, చిగుళ్ల నొప్పిని తగ్గించడంలో ఉప్పు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది . ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఉప్పును వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. ఇలా రోజు మొత్తంలో మీకు వీలైనన్ని సార్లు చేస్తుండాలి. కొన్ని ఐస్ ముక్కలను ఒక వస్త్రంలో చుట్టి దాంతో నొప్పి ఉన్న చోట 10 నిమిషాల పాటు కాపడం పెట్టినట్లు మసాజ్ చేయాలి. దీంతో నొప్పి తగ్గుతుంది. లవంగ నూనెను నొప్పి ఉన్న చోట రాస్తున్నా లేక ఒక లవంగాన్నినొప్పి ఉన్న దంతంపై పెట్టుకున్న కూడా ఉపశమనం లభిస్తుంది. లవంగం నూనెలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అనాస్థటిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది.
ఒక కాటన్ బాల్ తీసుకుని దానికి కాస్త లవంగం నూనెను రాయాలి. ఇలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కనుక ఘాటు తట్టుకోలేమని అనుకునేవారు అందులో కాస్త కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనెను కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్‌కు రాసి నొప్పి ఉన్న దంతం లేదా చిగురుపై 30 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పెప్పర్ మింట్ టీ బ్యాగ్‌ను వేడి నీటిలో 5 నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం ఆ బ్యాగ్‌ను తీసేసి ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు చల్లార్చాలి. తరువాత ఆ మిశ్రమంలో ఒక కాటన్ బాల్‌ను ముంచి దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. పెప్పర్‌మింట్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కనుక దంతాలు, చిగుళ్ల నొప్పులను ఇది తగ్గిస్తుంది. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బను నామిలినా ఉపశమనం లభిస్తుంది.
Read Also: Health: మైగ్రేన్ తో బాధపడుతున్నారా అయితే ఈ టిప్స్ మీకే