తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేస్తున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తోందే కానీ విద్యార్థుల ఫీజులను మాత్రం పెండింగ్‌లో ఉంచడం దారుణమని ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు.
డిగ్రీ కాలేజీల పరిస్థితి దిగజారింది
డిగ్రీ కళాశాలలకు రూ.800 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు, కళాశాలలు తీవ్రంగా నష్టపోతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కాలేజీలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో పలు కళాశాలలు తాత్కాలికంగా తాళం వేసి సెలవులు ప్రకటించాయన్నారు. ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను ఇప్పటికీ నిర్వహించకపోవడం వల్ల పీజీ సెట్, లా సెట్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అర్హత కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో విద్యకు ప్రాధాన్యం, కాంగ్రెస్‌కు నిర్లక్ష్యం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సగటున రూ.2,000 కోట్లు విడుదల చేసి విద్యార్థులకు భరోసా ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. మొత్తం రూ.19,000 కోట్లను ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఖర్చు చేశామని తెలిపారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, మంత్రి భట్టివిక్రమార్క చేసిన వాగ్దానాలు అమలవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి వెంటనే బకాయిలను చెల్లించి, డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
Read Also : Tragedy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతి