ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టి వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఒక దేశ సమస్య మాత్రమే కాకుండా, అంతర్జాతీయ శాంతికి, అభివృద్ధికి విఘాతం కలిగించే ప్రమాదకర శక్తిగా అభివర్ణించారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, “ఉగ్రవాదం మానవాళికి ముప్పు. దీనికి అండగా ఉన్న శక్తులపై కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం ఈ విషయంలో సంకల్పబద్ధంగా ఉంది. ఉగ్రవాదంపై పోరాటంలో మేము ఎటువంటి రాయితీలు ఇవ్వం” అని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించిన ప్రధాని
ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిపై ప్రధాని స్పందిస్తూ, “ఈ విధమైన దాడులు దేశ సమగ్రతను, ప్రజల భద్రతను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అయితే ఈ దాడులపై మేము దృఢంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులు మరియు వారిని అండగా నిలబెట్టే శక్తులపై చర్యలు తీసుకోవడం మాకు ప్రాధాన్యత” అని తెలిపారు.
అంగోలా మద్దతు
అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సో భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలో ప్రధాని మోదీతో కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం, జలవనరుల అభివృద్ధి, ఉగ్రవాద నిరోధం వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి. మోదీ మాట్లాడుతూ, “ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, భారత్ పోరాటానికి అంగోలా మద్దతు తెలపడం అనందదాయకం. ఇది భారత్–అంగోలా సంబంధాల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. భారత్, అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Read also: Military Officer: భారత్ పై బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు