దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర కేబినెట్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని అణగారిన వర్గాల హక్కులను పరిరక్షించేందుకు, వారికి తగిన ప్రాధాన్యత కల్పించేందుకు మరింత స్పష్టత వచ్చి సామాజిక న్యాయ సాధనలో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు.
రాహుల్ వల్లే కేంద్రం ఈ నిర్ణయం
రాహుల్ గాంధీ దార్శనికతకు కేంద్రం చర్య తీసుకున్నదనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటిగా కులగణనను ప్రారంభించిన రాష్ట్రమని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో ఈ చర్యలు ప్రారంభమయ్యాయని, ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం కేంద్రాన్ని ప్రభావితం చేయగలిగిందన్నదే ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు.
Read Also : Caste Census : కాంగ్రెస్ కులగణనకు వ్యతిరేకి – బండి సంజయ్
కేంద్ర నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయం
ఈ నేపధ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పందిస్తూ, కేంద్ర నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలే తెలంగాణలో కులగణన సర్వేకు ప్రేరణగా మారాయని, ప్రజల్లో నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సాధారణ జనగణనతోపాటు కుల గణన కూడా సమాజ నిర్మాణంలో సమానత్వాన్ని స్థిరపరిచేందుకు ఉపయోగపడుతుందన్నారు.