తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా (CS) ఇటీవల నియమితులైన కె. రామకృష్ణరావు నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీ విరమణకు చేరుకోవడంతో ఆమె స్థానాన్ని రామకృష్ణరావు భర్తీ చేయనున్నారు. సాయంత్రం సమయంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక పదవి
1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావు గతంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కీలక పదవిలో పనిచేశారు. ఆయనకు పాలనాపరంగా ఉన్న అనుభవం, ఆర్థిక రంగంపై మంచి పట్టుదల వలన ప్రభుత్వం ఈ పదవికి ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. రామకృష్ణారావు ఇప్పటి వరకు సేవలందించిన వివిధ శాఖల్లో అతని ప్రతిభకి మంచి గుర్తింపు లభించింది.
శాంతికుమారి పదవీ విరమణ
శాంతికుమారి పదవీ విరమణ అనంతరం ముఖ్య కార్యదర్శి బాధ్యతలను చేపట్టనున్న రామకృష్ణారావు, రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు, తక్షణ ప్రాధాన్యతలతో ముందుకు వెళ్లే అవకాశముంది. పాలనాపరంగా కొనసాగుతున్న ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమన్వయం కలిగించే బాధ్యత ఆయనపై ఉంటుంది. కొత్త సీఎస్‌తో ప్రభుత్వ పాలనలో నూతన దిశ ఏర్పడనుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.