భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం
భారత ప్రభుత్వం ఇటీవల 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించడమే కాకుండా, వాటి కంటెంట్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉందని తీవ్రంగా పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చర్య తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాద దాడులకు అనుబంధంగా భారత్ మీద తప్పుడు ప్రచారం చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వీడియోలు ప్రచురిస్తున్నందున ఈ యూట్యూబ్ ఛానెళ్లను పూర్తిగా నిషేధించినట్టు కేంద్ర సమాచార శాఖ స్పష్టం చేసింది.
ఈ ఛానెళ్లలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తులైన కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. అందులో ప్రముఖ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉండటం గమనార్హం. షోయబ్ అక్తర్ తన ఛానెల్ ద్వారా క్రికెట్ విశ్లేషణలు, మ్యాచ్‌లపై అభిప్రాయాలు, పాక్–భారత్ సంబంధాలపై అప్పుడప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉండేవాడు. అతని ఛానెల్‌కు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉండటంతో, ఈ బ్యాన్పై పాకిస్తాన్ నుండి తీవ్ర విమర్శలు రావచ్చని భావిస్తున్నారు.
తప్పుడు వార్తలు, మత విద్వేషాలు వ్యాప్తికి అడ్డుకట్ట
భారత ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఈ 16 యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా భారత భద్రతా వ్యవస్థను కించపరచే విధంగా తప్పుడు సమాచారం ప్రదర్శించబడుతోంది. ఈ వీడియోల్లో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్‌లో నేడు ఉన్న పరిస్థితులను తప్పుదోవ పట్టించేలా చూపించడం, భారత సైన్యం గురించి అపోహలు సృష్టించడం, మతపరంగా రెచ్చగొట్టే మాటలు వినిపించడం వంటి విషయాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ఇంటర్నెట్ నియంత్రణ సంస్థలు తక్షణమే స్పందించి యూట్యూబ్‌కు నిషేదించాయి.
ఈ చర్య ద్వారా భారత్ తప్పుడు సమాచారం వ్యాప్తిని నియంత్రించడమే కాకుండా, సైబర్ భద్రతా పరంగా ఒక స్పష్టమైన సందేశం పంపించినట్లయింది. దేశంలో అసత్య కథనాలను వ్యాప్తి చేయడం ద్వారా సామాజిక సామరస్యాన్ని భంగం చేయడాన్ని భారత ప్రభుత్వం సహించదని స్పష్టంగా తెలిపింది.
భారత్–పాక్ సంబంధాల్లో మరో ఉద్రిక్త ఘట్టం
ఇప్పటికే భారత్–పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడులు చాలావరకు నిలిచిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. ఇటీవలి దాడి, ఆపై తీసుకున్న డిజిటల్ మీడియా ఆంక్షల నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముంది. పాకిస్తాన్ వైపు నుంచి భారత్‌పై మాటల దాడులు వస్తాయని, అంతర్జాతీయ వేదికలపై భారత్ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కానీ భారత్ మాత్రం జాతీయ భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీకి ఆస్కారం లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించింది. దేశ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించే తీరులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. డిజిటల్ మీడియా మార్గంగా దేశ వివిచ్ఛిన్నత కోసం జరుగుతున్న ప్రయత్నాలను అరికట్టడమే ఈ నిర్ణయం వెనక ప్రధాన ఉద్దేశ్యమని చెప్పవచ్చు.
read also: Big Shock : పాక్ కు భారత్ మరో షాక్!