పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై నాలుగు రోజుల అనంతరం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ తమపై అనవసరంగా నిందలు మోపుతోందని ఆరోపిస్తూ, తమ దేశం శాంతికే ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. అయితే భారత్ నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన హెచ్చరించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్న షరీఫ్, తటస్థ, పారదర్శక దర్యాప్తుకు సిద్ధమని ప్రకటించారు.
భారత్ చర్యలపై షెహబాజ్ విమర్శలు
భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష చర్యలను తీవ్రంగా ఖండించిన షెహబాజ్, ఇలాంటి నిర్ణయాలు సమస్యలను పెంచుతాయని అన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామని, పహల్గామ్ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తును స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ దాడి కారణంగా మరోసారి తమ దేశం అనవసరమైన విమర్శల పాలవుతోందని, దీనిపై న్యాయమైన దర్యాప్తు జరగాలని కోరారు.
ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధం
ఉగ్రవాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన షెహబాజ్, పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వంటి చర్యలతో భారత్ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని కోరుతూ, బాధ్యతాయుతమైన దేశంగా తాము నడుస్తున్నామని షరీఫ్ హామీ ఇచ్చారు.
Read Also : ఉదయం ఖాళీ కడుపుతో ఇది తాగితే మధుమేహం పరార్