పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతా వర్గాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, టెర్రరిస్టులు కశ్మీరీ పండిట్‌లను, స్థానికేతరులను, ముఖ్యంగా రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న ISI నుంచి ఇదే ఆదేశాలు వచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), స్థానిక పోలీస్ శాఖలు, భద్రతా దళాలకు హెచ్చరికలు
ఈ నేపథ్యంలో కేంద్రం మరింత భద్రతా చర్యలు చేపట్టింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), స్థానిక పోలీస్ శాఖలు, భద్రతా దళాలకు హెచ్చరికలు జారీచేసి అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ముఖ్యంగా రైల్వే సిబ్బంది రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప తమ బ్యారక్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరారు.
ప్రత్యేక నిఘా వ్యవస్థ అమలు
ఉగ్రవాదుల లక్ష్యంగా మారే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో భద్రతను పెంచుతూ, ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నారు. కశ్మీరీ పండిట్‌లు, ఇతర సామాన్య ప్రజలకు తగిన రక్షణ కల్పించే చర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. పౌరులు అవసరమయ్యేంతవరకూ బయటకు రాకూడదని, అపరిచిత వ్యక్తులపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న సూచనలు జారీ అయ్యాయి.