ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రం పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతగానో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ కి ఆహ్వానం
ఈ సందర్భంగా మే 2వ తేదీన అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకావాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా కేంద్రం నుంచి సహకారం ఆశిస్తున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, ఇతర ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
ప్రధాని రాక .. అమరావతిలో భారీ ఏర్పాట్లు
ప్రధాని మోదీ రాక నేపథ్యంలో అమరావతిలో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. అంతేకాకుండా, దాదాపు 30 వేల మంది పాల్గొననున్న రోడ్‌షోలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అమరావతిలో ప్రారంభమయ్యే అభివృద్ధి పనులకు ప్రతీకగా మోదీ పైలాన్‌ను ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.