IPL : కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ల ఫెయిల్యూర్ – ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. అయితే ఆటలో ప్రతిభ చూపించాలన్న ఆశతో కోట్ల రూపాయలు వెచ్చించి తీసుకున్న కొంతమంది స్టార్ క్రికెటర్లు మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచారు. ఎక్కువ ధరకు కొనుగోలు చేసినప్పటికీ వారి ప్రదర్శన నిలకడగా లేకపోవడం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది.ఈ జాబితాలో ముందుగా రిషబ్ పంత్ పేరును చెప్పాల్సిందే. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.27 కోట్ల భారీ ధరతో పంత్‌ను కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్లలో కేవలం 17.17 సగటుతో 103 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే. చెన్నైపై 63 పరుగులు చేసినా, ఆ మ్యాచ్‌లో జట్టు ఓడిపోవడం వల్ల అతని ఇన్నింగ్స్ కీలకంగా నిలవలేదు. కెప్టెన్సీలోనూ పంత్ అనూహ్యమైన నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.మరోవైపు గ్లెన్ మాక్స్వెల్ కూడా ఈ సీజన్‌లో తన స్టామినా చూపలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ జట్టు రూ.4.2 కోట్లకు అతన్ని కొనుగోలు చేసినా, ఇప్పటివరకు కేవలం 41 పరుగులే చేశాడు. అతని తరహాలో లాంగ్ షాట్లు కొట్టే ఆటగాడిగా పేరున్నప్పటికీ, ఈ సీజన్‌లో కేవలం 4 ఫోర్లు, ఒకే ఒక సిక్సర్‌తో నిరాశపరిచాడు.

అంచనాలు తలకిందులుచేసిన ఖరీదైన ఆటగాళ్లు
ఇంకొక నిరాశజనక ప్రదర్శన చూపించిన ఆటగాడు వెంకటేష్ అయ్యర్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ఆటగాడు, 7 మ్యాచ్లలో కేవలం 121 పరుగులే చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లో 60 పరుగులు చేయడంతో పాటు మెరుపు ప్రదర్శన ఇచ్చినా, మిగతా మ్యాచ్లలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.మార్కస్ స్టోయినిస్ విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ అతన్ని రూ.11 కోట్లకు కొనుగోలు చేసినా, 6 మ్యాచ్లలో కేవలం 66 పరుగులే చేయగలిగాడు. బౌలింగ్‌లోనూ పూర్తి విఫలం – ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీసకపోవడం ఫ్రాంచైజీకి మింగుడుపడని విషయంగా మారింది.ఈ సీజన్‌లో అంచనాలు పెట్టిన ఖరీదైన ఆటగాళ్లు ఫెయిలవడాన్ని చూసి అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు వెచ్చించగా, ఫలితం మాత్రం పెద్దగా కనబడకపోవడం ఇప్పటి ఐపీఎల్ 2025లో చర్చనీయాంశంగా మారింది.
Read More : IPL 2025: ధోనీ కాళ్లు మొక్కిన వైభవ్ సూర్యవంశీ!