SSC నియామక పరీక్షల్లో కొత్త విధానం: మే 2025 నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ ఆశావాహులకు కీలకంగా మారింది. ఇకపై SSC నిర్వహించే అన్ని నియామక పరీక్షలలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడకుండా, నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ నూతన విధానం మే 2025 నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు ఏప్రిల్ 20న అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం SSC వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం ప్రకారం, అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో తమ ఆధార్ వివరాలను తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే పరీక్షా కేంద్రంలో హాజరైనప్పుడు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తిగా నిర్వహించనున్నారు.
పరీక్షా ప్రక్రియలో పారదర్శకత.. అభ్యర్థులకు సౌకర్యం
SSC వెల్లడించిన ప్రకారం, ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ అభ్యర్థుల కోసం స్వచ్ఛందంగానే ఉద్దేశించబడింది. ఇది వారి గుర్తింపును ధృవీకరించడంతో పాటు పరీక్షా ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా నకిలీ అభ్యర్థులను, మోసపూరిత ప్రయత్నాలను ముందుగానే గుర్తించి నిరోధించేందుకు ఇది పెద్దగా సహాయపడనుంది. గతంలో కొన్ని పరీక్షల్లో గుర్తింపు ధ్రువీకరణలో సమస్యలు తలెత్తడం, తప్పుడు మార్గాలతో కొన్ని అభ్యర్థులు పరీక్షలు రాయడం వంటి ఘటనల నేపథ్యంలో కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా హాళీల వద్ద ఆధార్ ఆధారిత స్కానింగ్ సిస్టంలు ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం వలన గుర్తింపులో స్పష్టత ఉండి, అభ్యర్థుల హక్కులు కాపాడబడతాయి.
SSC, UPSC నియామక పరీక్షలపై ఆధార్ ధృవీకరణ ప్రభావం
కేవలం SSC మాత్రమే కాదు, UPSC కూడా ఇప్పటికే ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ విధానాన్ని మంజూరు చేసిందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు 28న, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే పరీక్షలకు ఆధార్ ఆధారిత ధృవీకరణను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. UPSC ప్రతి సంవత్సరం 14 రకాల కీలక పరీక్షలు నిర్వహిస్తుంది. అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సివిల్ సర్వీసెస్ పరీక్ష. దీని ద్వారా IAS, IFS, IPS లాంటి అగ్రశ్రేణి ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. అలాగే SSC ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థుల మధ్య ఏడు రకాల అఖిల భారత స్థాయి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇలాంటి విస్తృత పరీక్షా వ్యవస్థల్లో ఆధార్ ఆధారిత ధృవీకరణ అమలు చేయడం ద్వారా మోసాలను తగ్గించడంతోపాటు పరీక్షా వ్యవస్థపై అభ్యర్థుల విశ్వాసాన్ని పెంచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రయోజనాలు
ఆధార్ ఆధారిత ధృవీకరణ ద్వారా అభ్యర్థుల ఒరిజినల్ గుర్తింపును నిర్ధారించడమే కాకుండా, వేగవంతమైన ప్రవేశ ప్రక్రియను అందించవచ్చని అధికారులు వివరించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు ప్రత్యేకమైన బయోమెట్రిక్ వేదికల ద్వారా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ సమయంలో ఆధార్ డీటెయిల్స్ సమర్పించడం వల్ల డూప్లికేట్ రిజిస్ట్రేషన్లను కూడా నివారించవచ్చు. పరీక్షా ప్రక్రియను న్యాయంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ విధానం ఎంతో దోహదపడనుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తన ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు కూడా ఈ కొత్త విధానాన్ని స్వాగతిస్తూ, తమ ప్రామాణికతను నిరూపించుకునేందుకు సహకరించాలని అధికారుల ఆశయం.
READ ALSO: TG Inter Result 2025: తెలంగాణలో రేపే ఇంటర్ ఫలితాలు