ములుగు జిల్లా వెంకటాపూర్‌లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు
ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో జరిగిన భూభారతి అవగాహన సమావేశం రైతులకు భవిష్యత్తులో భూముల సమస్యల పరిష్కారానికి దోహదపడే కార్యక్రమంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మరియు ఎంపీ పోరిక బలరాం నాయక్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సదస్సు, భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలో ప్రవేశపెట్టడం కోసం నిర్వహించబడింది.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హార్ట్‌బీ రిజియన్‌లో 18 లక్షల ఎకరాల భూముల్లో 6 లక్షల ఎకరాలు వ్యవసాయ భూములుగా గుర్తించబడినప్పటికీ, ఆ భూములపై సరైన న్యాయం జరగలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం “భూభారతి చట్టం” తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా రైతులకు భూసంబంధిత సమస్యల పరిష్కారం దొరికే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఇంకా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల లక్షల మంది రైతులు నష్టపోయారని, పలు భూములు రిజిస్ట్రేషన్ కాకుండా నిలిపివేయబడ్డాయని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలేని తెలంగాణను నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పేద రైతుల కన్నీళ్లను తుడిచే ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని రూపొందించామని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతులకు న్యాయం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీతక్క, కొండ సురేఖ కూడా మాట్లాడారు. రాష్ట్రంలో భూసమస్యలు ప్రధాన సమస్యగా మారాయని, ప్రతి ఒక్కరికి భూమిపై హక్కు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు. భూభారతి చట్టంతో ప్రతి రైతుకు భూమిపై పక్కా హక్కు లభించేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హెలికాప్టర్లలో వచ్చిన మంత్రులకు జిల్లా కలెక్టర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు భారీ బైక్ ర్యాలీలో పాల్గొని స్థానికులకు చట్టంపై అవగాహన కల్పించారు.
Read More : Toshiba : తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్న తోషిబా