KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గచ్చిబౌలి భూముల వ్యవహారం పై ప్రధాని మోడీకి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా ప్రధానిని ఆయన కోరారు. కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి అని కేటీఆర్ అన్నారు.
వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం
దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10వేల కోట్ల ఆర్థిక మోసం. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధరించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి అని కేటీఆర్ కోరారు.
గచ్చిబౌలిలో రూ.10 వేల కోట్ల ఆర్థిక అక్రమాలు
నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. నిస్సిగ్గుగా, అక్రమంగా పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కంచ గచ్చిబౌలిలో రూ.10 వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. ప్రధానిగా పర్యావరణ పరిరక్షణ, నిర్వహణపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాదని, కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలి అని కేటీఆర్ అన్నారు.
Read Also: నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు