ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు నిద్రలేచారు. స్టేడియాన్ని షాట్లతో ఊపేసి, సన్‌రైజర్స్ బౌలింగ్‌ను చీల్చి చిత్తు చేశారు. టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని గరిష్ఠంగా స్కోరు చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం వారికి బంగారమైంది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 6 వికెట్లకు 245 పరుగులు నమోదు చేసింది.ఇన్నింగ్స్‌కు శుభారంభం అందించింది పంజాబ్ ఓపెనింగ్ జోడీ. ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి 4 ఓవర్లలోనే 66 పరుగులు జోడించారు. ప్రియాన్ష్ 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సులతో 38 పరుగులు చేయగా, ప్రభ్ సిమ్రన్ 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఈ దెబ్బకు సన్‌రైజర్స్ బౌలర్లు తేలిపోక తప్పలేదు.

కెప్టెన్ అయ్యర్ శతానికి అంచుల వద్ద
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. కూల్‌గా, కచ్చితంగా, ఎదురుదాడికి సెట్ అయి 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ పంజాబ్ స్కోరుకు గొప్ప బలాన్నిచ్చింది.ఇన్నింగ్స్ చివర్లో స్టొయినిస్ మెరుపులు జలపాతంలా ప్రవహించాయి. చివరి ఓవర్‌లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సులు బాదేశాడు. అతను కేవలం 11 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 34 పరుగులు చేశాడు.
బౌలర్లకు కష్టాలు – షమీ చెత్త రికార్డు అంచున
సన్‌రైజర్స్ బౌలింగ్ పూర్తిగా నిరాశ కలిగించింది. ప్రతి బౌలర్ ఓవర్‌కు 10కి పైగా పరుగులిచ్చాడు. హర్షల్ పటేల్ మాత్రం 4 వికెట్లు తీసి కొంత భరోసానిచ్చాడు. యువ బౌలర్ ఇషాన్ మలింగ 2 వికెట్లు తీసి తన స్థాయి చూపించాడు. కానీ షమీ 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అదృష్టవశాత్తూ, చెత్త రికార్డు మాత్రం తప్పించుకున్నాడు. ఈ సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ 76 పరుగులు ఇచ్చిన రికార్డే అతన్ని తప్పించింది.
Read Also : Sunrisers Hyderabad : ఈ సీజన్ లో చెత్తగా ఆడుతున్న సన్ రైజర్స్