తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయంగా మారబోతున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారి అందరికీ స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. పర్యాటకానికి, వనరుల పరిరక్షణకు, నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాజెక్ట్ ఎలా మార్గదర్శకంగా నిలవాలో ఆయన వివరించారు.

మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్
బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మాణం ప్రాజెక్ట్‌లో భాగంగా పునరుద్ధరణకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ ప్రదేశం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండటంతోపాటు, శాంతి, స్వచ్ఛతకు ప్రతీకగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే నగరానికి మరింత గౌరవం తెచ్చే అవకాశముంది.
మీర్ ఆలం ట్యాంక్ బ్రిడ్జి
మీర్ ఆలం ట్యాంక్‌పైన బ్రిడ్జి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతగా పరిగణించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జూన్‌లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రక్రియకు ముందుగా అవసరమైన సర్వేలు, నివేదికలు, డిజైన్లు సిద్ధం చేసి డీపీఆర్ సమర్పించాలని సూచించారు. ఈ బ్రిడ్జి రెండున్నర కిలోమీటర్ల పొడవు కలిగి ఉండనుంది. సందర్శకుల భద్రతకు గరిష్ట ప్రాధాన్యత ఇస్తూ, ఆసక్తికరమైన ఆకృతి, లైటింగ్‌తో ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని సీఎం సూచించారు. మీర్ ఆలం ట్యాంక్‌లో మూడు ఐలాండ్లు ఉన్నాయని, వీటిని ‘గార్డెన్స్ బై ది బే’ ను తలపించేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఐలాండ్లపై బర్డ్స్ పారడైజ్, వాటర్‌ఫాల్స్, అడ్వెంచర్ పార్క్, అంఫీ థియేటర్, థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా, వెడ్డింగ్ డెస్టినేషన్‌గా కూడా మారేలా కన్వెన్షన్ సెంటర్లు, ప్రత్యేకంగా పర్యాటకుల కోసం రిసార్ట్స్, హోటల్స్, బోటింగ్ వంటి ఆకర్షణలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయాలని చెప్పారు.
మీర్ అలం ట్యాంక్‌లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు రూపొందించాలి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించి ఆ మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని సీఎం సూచించారు. మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్‌ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలి. ఇక్కడి అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్‌గ్రేడ్ చేయాలి. జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలి. అభివృద్ధి ప్రతిపాదనలన్నీ పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉండాలి అని ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి, శ్రీనివాస రాజు, మున్సిపల్ శాఖ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read also: Revanth Reddy: పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి