అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ విధానాలు ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ విధానం, ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రంగానికీ తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు దేశీయ ఆక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసిన చంద్రబాబు
ఈ సమస్యను కేంద్రమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నేరుగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. లేఖలో, అమెరికా విధించిన 27 శాతం అధిక సుంకాల కారణంగా దేశీయ ఆక్వా రైతులు పెద్దగా నష్టపోతున్నారని వివరించారు. అమెరికా ప్రభుత్వం విధించిన ఈ అధిక టారిఫ్‌లు తగ్గించాలని, భారత్‌కి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్డర్లు రద్దు – కోల్డ్ స్టోరేజీలకు ముప్పు
అధిక టారిఫ్‌ల వల్ల విదేశీ సంస్థలు భారతీయ ఆక్వా ఉత్పత్తులపై ఆర్డర్లు రద్దు చేసుకుంటున్నాయని చంద్రబాబు లేఖలో వెల్లడించారు. దీని ప్రభావంగా, ఏపీలోని కోల్డ్ స్టోరేజీలు ఇప్పటికే ఉత్పత్తులతో నిండిపోతున్నాయని, నిల్వ చేసే స్థలాలు కూడా లేకుండా పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే మత్స్యరంగం తీవ్ర సంక్షోభానికి గురవుతుందని హెచ్చరించారు.
ఆక్వా రైతులకు కేంద్రం మద్దతుగా ఉండాలి
రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగానికి గల ప్రాధాన్యతను గుర్తు చేసిన చంద్రబాబు, ఈ రంగాన్ని నిలబెట్టడానికి కేంద్రం మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఆక్వా రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంటూ, తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిష్కర్షాత్మక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంక్షోభ సమయంలో రైతులకు అండగా నిలిచే విధంగా విధానాలు రూపొందించాలని చంద్రబాబు సూచించారు.