శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమి పర్వదినం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆధ్యాత్మికంగా, ఉత్సాహంగా, జరుపుకుంటారు. ప్రతి నగరం, పట్టణం, గ్రామం సైతం రామనామ స్మరణలతో మార్మోగుతూ, భక్తి పారవశ్యానికి అద్దం పడుతోంది. ఆలయాల వద్ద భక్తుల పోటెత్తు, భజనలు, రామాయణ పారాయణం, సీతారాముల కళ్యాణోత్సవాలతో రాముడి జీవితం మరోసారి ప్రతి హృదయంలో ప్రతిధ్వనిస్తోంది.

చంద్రబాబు శుభాకాంక్షలు
ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రజాస్వామ్య పరిపాలనకు మార్గదర్శకమని, రాముడు తన పాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆదర్శ పాలన అందించిన మహానుభావుడిగా నిలిచారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ధర్మాన్ని ఆశ్రయించే పాలన ఎలా ఉండాలో శ్రీరాముడు చూపించిన మార్గమేనని గుర్తు చేస్తూ – అందుకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి తన ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. రాముని ధర్మాన్ని అనుసరిస్తూ అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన సోషల్ మీడియా వేదిక ‘X’ ద్వారా తన శుభాకాంక్షలను తెలియజేశారు.
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు
కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కొలువై ఉన్న కోదండరామ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం రామనవమి సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాలు వేలాది భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఈసారి మరింత వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. సీతారాముల కళ్యాణోత్సవం ఈ నెల 11న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయం వందలాది తులాల పూలతో అలంకరించబడి, భక్తుల సంద్రంగా మారింది. ఒంటిమిట్ట ఆలయం చారిత్రక ప్రాముఖ్యత కలిగినది. స్వయంగా భక్త రామదాసు కీర్తించిన ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ జరుగుతున్న కళ్యాణోత్సవంలో పాల్గొనాలని ఎంతో మంది భక్తులు దూర దూరం నుండి తరలివస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రామనవమి ప్రత్యేకత
ఈ పర్వదినంలో ప్రధాన ఘట్టంగా సీతారాముల కళ్యాణోత్సవం”ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పందిళ్ల కింద దేవతల వివాహ ఘట్టాన్ని అద్భుతంగా మలచి, వేద మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు పానకం, వడపప్పు, మామిడి ముక్కలు వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి, భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఇవి వేసవి కాలానికి అనుగుణంగా శరీరాన్ని శాంతపరిచే గుణాలను కలిగి ఉంటాయి. వ్రతాచరణ చేసిన భక్తులు ఉపవాసం తర్వాత ఈ ప్రసాదాలను తీసుకుంటారు. సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే సంప్రదాయం ఈ పండుగలో చోటు చేసుకుంది.
Read also: Narendra Modi: అమరావతిలో మోదీ పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభం