కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ టీ వీణా విజయన్‌పై విచారణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇది కేవలం సాధారణ విచారణ కాదు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) ఛార్జ్‌షీట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) నుంచి వీణా విజయన్‌కు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే కంపెనీ అక్రమ రీతిలో నిధులు బదిలీ చేసుకున్నట్లు ఈ విచారణలో తేలింది.

2017 నుంచి 2020 మధ్యకాలంలో CMRL కంపెనీ నుంచి ఎక్సాలాజిక్ కంపెనీకి సుమారు రూ.1.72 కోట్లు బదిలీ అయినట్లు బయటపడింది. ఈ లావాదేవీలు సరైన పద్ధతిలో జరగలేదని, అవి అక్రమంగా నిర్వహించబడ్డాయని SFIO తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. SFIO దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో మొత్తం 160 పేజీలు ఉన్నాయి. ఇందులో వీణా విజయన్‌తో పాటు CMRL మేనేజింగ్ డైరెక్టర్ శశిధర్ కార్తా సహా మరో 25 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వీణా విజయన్ దోషిగా తేలితే, ఆమెకు కనీసం ఆరు నెలల నుంచి పది సంవత్సరాల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
కోర్టులో కేసు విచారణ
ఈ కేసు ప్రస్తుతం కొచ్చిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో నడుస్తోంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం, వీణా విజయన్‌పై సెక్షన్ 447 కింద ఆరోపణలు మోపారు. ఈ సెక్షన్ కింద శిక్షతో పాటు పెనాల్టీ విధించే అవకాశముంది. ఈ కేసు కేరళ రాజకీయాలను గట్టిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సతతంగా తన ప్రభుత్వాన్ని అవినీతి రహితమని పేర్కొంటూ వస్తున్నారు. అయితే ఆయన కుమార్తె పేరు ఇలాంటి కేసులో వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కేసుపై సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ, ఇది రాజకీయ కుట్ర అని, తమ కుటుంబాన్ని అప్రతిష్టకు గురి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.