Zomato: కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న 500 మందికిపైగా ఉద్యోగుల్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఇంటికి పంపింది. నియామకం చేపట్టిన ఏడాదిలోపే తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జొమాటో తన క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ వృద్ధిలో మందగమనం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. జొమాటో కస్టమర్ సపోర్ట్ విభాగం కింద 1500 మందిని నియమించింది.

వీరందరికీ ఒక నెల జీతాన్ని పరిహారంగా
వీరిలో చాలా మందిని పేలవమైన పనితీరు, సమయపాలన పాటించని కారణంగా నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే తొలగించింది. వీరందరికీ ఒక నెల జీతాన్ని పరిహారంగా ఇచ్చిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. స్పష్టమైన వివరణ లేకుండా ఇంటికి పంపినట్లు వారు తెలిపారు. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ పేరిట ఏడాది క్రితం ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నియామకాలు చేపట్టింది. కస్టమర్ సపోర్ట్ విధాలను ఆటోమేట్ చేయడంతో పాటు ఖర్చుల్ని నియంత్రించుకోనేందుకు కృత్రిమ మేధ ను వినియోగించుకోవాలని జొమాటో చూస్తోంది.
లేఆఫ్‌ల పై అధికారిక ప్రకటనా వెలువడలేదు
అందులో భాగంగానే ఈ లేఆఫ్‌లు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ చర్యల వల్ల ఆ విభాగంలోని ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే లేఆఫ్‌ల విషయంపై జొమాటో యాజమాన్యం నుంచి ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇదిలా ఉండగా.. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో మందగమనం నెలకొందని జొమాటో ప్రకటించింది. ఇక క్విక్ కామర్స్ విభాగంలో పెరుగుతున్న పోటీ కారణంగా బ్లింకిట్ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో లేఆఫ్‌ల వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.