దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రావడంతో ఆలయ సందర్శనకు సంబంధించిన నిబంధనలు కఠినతరం అయ్యాయి. ముఖ్యంగా సాంప్రదాయ వస్త్రధారణ పై కఠిన నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఆలయాలకు మరింత పవిత్రత తీసుకురావాలన్న ఉద్దేశంతో పొట్టి దుస్తులు, శరీర ఆకృతి కనిపించే దుస్తులను నిషేధిస్తూ ఆలయ కమిటీలు కొత్త నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆలయాల డ్రెస్సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత పోష్ లుక్ లో ఉండే రకుల్, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సరైన వస్త్రధారణ పాటించాలనే విషయాన్ని ప్రస్తావించడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.

ఫ్యాషన్ & సంప్రదాయం – రకుల్ అభిప్రాయం
ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్, సందర్భాన్ని బట్టి మన డ్రెస్సింగ్ మారాలని, ముఖ్యంగా ఆలయాల వంటి పవిత్ర ప్రదేశాలకు వెళ్తే సంప్రదాయ వస్త్రధారణ పాటించాల్సిన అవసరం ఉందని తెలిపింది. పబ్లిక్ ఫిగర్ గా మనం ఏది చేసినా బాధ్యతాయుతంగా చేయాలి. ఫ్యాషన్ అనేది ఒక వ్యక్తిగత విషయం అయినా, సందర్భాన్ని బట్టి మనం ఏం ధరిస్తున్నామనేది ఎంతో ముఖ్యం. దేవాలయాల్లో మించిన పవిత్ర ప్రదేశాలు మరేమున్నాయి? అలాంటి చోట్ల సంప్రదాయ దుస్తులు ధరించడం సముచితం. ఆమె మాటల్లో, జిమ్ కి వెళ్లినప్పుడు వర్కౌట్ కి అనుగుణంగా, డిన్నర్ కి వెళ్తే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా వస్త్రధారణ ఉండాలి. అలాగే దేవాలయాల్లోనూ మన సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులను ధరించడం కచ్చితంగా పాటించాలి.
ఆలయాల్లో కొత్త డ్రెస్ కోడ్ – ఆచరణలోకి ఎలా?
ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయం ఈ ఏడాది జనవరిలో సంప్రదాయ డ్రెస్సింగ్ పై ప్రత్యేక మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఆలయ ప్రాంగణంలో పొట్టి దుస్తులు, శరీరాన్ని స్పష్టంగా చూపించే దుస్తులు పూర్తిగా నిషేధించారు. భక్తులు భారతీయ సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి రావాలనే నిబంధనను విధించారు. దక్షిణ భారతదేశంలోని ఆలయాల్లో ఇప్పటికే డ్రెస్ కోడ్ అమలులో ఉంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పురుషులు పై వస్త్రాలు లేకుండా ధోతీ లేదా పంచె ధరించాలి. మహిళలు సారీ లేదా సల్వార్ కమీజ్ ధరించాలి. భారతీయ సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించి ఆలయానికి రావాలని ఆలయ ట్రస్ట్ తెలిపింది. దక్షిణాదిన ఇప్పటికే ఈ డ్రెస్ కోడ్ ను ఆలయాలు అమలు చేస్తున్నాయి.