హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల కోసం ఎదురు చూసే సినీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. ఆయన టేకింగ్, పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ప్యాక్డ్ స్క్రీన్‌ప్లే అభిమానులను ఆకట్టుకుంటాయి. అయితే ‘లైగర్’ , ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాల తర్వాత, పూరి జగన్నాథ్ నుంచి ఎలాంటి కొత్త సినిమా అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు, పూరి జగన్నాథ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న తమిళ స్టార్ విజయ్ సేతుపతి తో పూరి జగన్నాథ్ కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ వార్తలు గత కొంతకాలంగా ఊహాగానాలుగా వినిపిస్తున్నా, ఇప్పుడది అధికారికంగా ధృవీకరించబడింది.

విజయ్ సేతుపతి – మాస్ కాంబో
పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో సినిమా వస్తోందని ‘పూరి కనెక్ట్స్’నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోయే ఈ చిత్రం గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతి నటనకు, క్యారెక్టరైజేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విలన్ గా, హీరోగా, సహాయ నటుడిగా, విలక్షణమైన పాత్రలతో వివిధ భాషల్లో విజయాన్ని అందిపుచ్చుకుంటూ వస్తున్నారు. ఇటీవల ఆయన బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాలు చేశారు. ఇక పూరి జగన్నాథ్ స్టైల్ మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా 2025 జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. కథ, ఇతర నటీనటుల ఎంపికపై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి లాంటి ప్రతిభావంతుడితో కలిసి పని చేయడం, పూరికి మళ్లీ మాస్ మార్కెట్‌ను అందించే అవకాశముంది.