DK Aruna : ఎవరి పైనా అనుమానం లేదన్న డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ ఇంట్లోకి ఓ అనుమానాస్పద వ్యక్తి చొరబడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆమె తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినట్లు వెల్లడించారు. అయితే తనకు ఎవరిపైనా అనుమానం లేదని స్పష్టం చేశారు.ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో డీకే అరుణ మాట్లాడుతూ, ఆగంతుకుడు ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ, ఏమీ ముట్టుకోకుండానే వెళ్లిపోయాడని తెలిపారు. సాధారణంగా దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఏదైనా అపహరిస్తాడు, కానీ ఈ వ్యక్తి అలాంటి ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఎవరికైనా కుట్ర ఉన్నదా రాజకీయ కక్షతో ఎవరైనా అతణ్ని పంపించారా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని అన్నారు.

భద్రతపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చ
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు డీకే అరుణ వెల్లడించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఏం జరిగిందనే విషయం స్పష్టత రావడం కష్టమని చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించి తన భద్రతను పెంచాలని కోరినట్టు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు.
సీసీ కెమెరాలు ఆపివేసిన అనుమానితుడు
తెల్లవారుజామున 3:28 గంటల సమయంలో ఓ వ్యక్తి ఇంటి వెనుక గోడ దూకి లోపలికి ప్రవేశించినట్లు డీకే అరుణ వివరించారు. కిటికీ ద్వారా లోనికి వచ్చి, అక్కడే ఉన్న కొన్ని సీసీ కెమెరాలను ఆపివేశాడని తెలిపారు. అయితే, మరికొన్ని కెమెరాలు ఆన్‌లోనే ఉండటంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లినట్టు చెప్పారు. ఇంట్లో దాదాపు గంటన్నర పాటు ఉన్నా, ఎలాంటి వస్తువులను ముట్టుకోలేదని, కేవలం ఇంట్లో సంచరిస్తూ వెళ్లిపోయాడని తెలిపారు. దర్యాప్తులో ఏమి తేలుతుందో ఇంట్లోకి చొరబడిన వ్యక్తి నిజంగా దొంగతనానికి వచ్చాడా లేక ఇది ఏదైనా రాజకీయ కుట్రా అనే ప్రశ్నలకు సమాధానం దర్యాప్తులోనే తెలుస్తుందని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, ఈ ఘటన మహబూబ్ నగర్ రాజకీయం మరియు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.