Jagadish Reddy: జగదీశ్ రెడ్డికి ఇంకా అహంకారం తగ్గలేదు:కాంగ్రెస్ నేత రమేశ్ రెడ్డి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిలో ఇంకా అహంకారం తగ్గలేదని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. స్పీకర్ పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి అన్యాయంగా తనను సస్పెండ్ చేశారనే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, నిజమైన ప్రజా నేత అయితే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బరిలో నిలబడాలని సవాల్ విసిరారు. ఈసారి ప్రజలు అతనికి గుణపాఠం చెబుతారని, డిపాజిట్ కూడా దక్కదని తేల్చిచెప్పారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన పటేల్ రమేశ్ రెడ్డి, అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే, తమ ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అయితే, అసెంబ్లీలో స్పీకర్ పట్ల మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనాగరికమైనవని, అటువంటి ప్రవర్తనను ఏ ఒక్కరూ సమర్థించలేరని స్పష్టంచేశారు.
అహంకారంతో మాట్లాడుతున్న జగదీశ్ రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగదీశ్ రెడ్డి, ఇంకా అదే దృష్టితో వ్యవహరిస్తున్నారని పటేల్ రమేశ్ రెడ్డి ఆరోపించారు. గతంలో రబ్బర్ చెప్పులు, డొక్కు స్కూటర్‌పై తిరిగిన వ్యక్తి ఎలా లక్షల కోట్లు సంపాదించాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఓ నియంతలా వ్యవహరించి వేల కోట్లు దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ 12 స్థానాలకు గాను 11 చోట్ల ఓడిపోయిందని, జగదీశ్ రెడ్డి మాత్రమే గెలిచారని గుర్తు చేశారు. ఓటమిని అంగీకరించకుండా ఆయన ఇంకా అధికార దర్పంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల తీర్పును గౌరవించే ధైర్యం ఉంటే తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి నిలబడాలని సవాల్ విసిరారు.
సభలో అసభ్య వ్యాఖ్యలు – పూర్తి సస్పెన్షన్ డిమాండ్
సభలో స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడిన జగదీశ్ రెడ్డిని పూర్తిగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని నిందించేందుకు అసెంబ్లీని వేదికగా మార్చడానికి వీల్లేదని, సభా సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఎమ్మెల్యేపై ఉంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన తీర్పు చెప్పేవారని, బీఆర్ఎస్ నేతలు ఓటమిని ఒప్పుకోలేక నకిలీ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని కోల్పోయినా తమ మనస్తత్వాన్ని మార్చుకోలేని నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుండగా, ప్రతిపక్షం అసత్య ప్రచారాలు చేయడం తగదని సూచించారు.