హోలీ సందర్భంగా ప్రజలు మర్యాదపూర్వకంగా సంబరాలు జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లడం పూర్తిగా నిషేధించబడిందని ఆయన హెచ్చరించారు. ఇలా చేయడం ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా చట్టపరమైన చర్యలకు దారి తీస్తుందని చెప్పారు.
పోలీస్ యాక్ట్ అమలులో
హైదరాబాద్లో హోలీ నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని CP తెలిపారు. ప్రజలు సాంప్రదాయబద్ధంగా, హద్దులు దాటి ప్రవర్తించకుండా వేడుకలను జరుపుకోవాలని సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లో అల్లర్లకు చోటు లేదు
పబ్లిక్ రోడ్స్, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో చెలరేగి వ్యవహరించడం నిషేధమని స్పష్టం చేశారు. హోలీ పేరుతో ఇతరులను బలవంతంగా రంగులతో సరదా చేయడం, మద్యం సేవించి హంగామా చేయడం చట్టపరంగా శిక్షార్హమని పేర్కొన్నారు. ప్రజలు ఒకరికొకరు గౌరవంతో మెలగాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పండుగను జరుపుకోవాలని పోలీసులు సూచించారు.
వాహనదారులకు ప్రత్యేక సూచనలు
బైకులపై గుంపులుగా తిరగడం, వేగంగా నడపడం, రోడ్డుపై ఆటవికంగా ప్రవర్తించడం కఠినంగా నిరోధించబడుతుందని CP తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ ఉత్సవాలు సంబరంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలనీ ఆయన ప్రజలను కోరారు.