పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిశ్ కనేరియా మరోసారి తన గత అనుభవాలను బయట పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అతను పాక్ జట్టులో తనకు ఎదురైన వివక్ష గురించి వివరించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
పాక్ క్రికెట్‌లో వివక్ష
డానిశ్ కనేరియా తన క్రికెట్ కెరీర్ పూర్తిగా నాశనం కావడానికి ప్రధాన కారణం తాను మైనారిటీలో ఉండటమేనని వెల్లడించాడు. పాకిస్థాన్‌లో హిందువుగా ఉన్న కారణంగా తనను తక్కువగా చూసేవారని, తనతో సహచరులు సరిగ్గా ప్రవర్తించేవారు కాదని చెప్పాడు. పాక్ జట్టులో తగిన గౌరవం, అవకాశాలు తనకు దక్కలేదని వాపోయాడు.నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను కాబట్టి, పాక్‌లో ఎదురుకున్న వివక్ష గురించి మాట్లాడటానికి అవకాశం వచ్చింది,అని తెలిపాడు కనేరియా. పాక్ క్రికెట్‌లో చాలామంది తనను అణచివేసే ప్రయత్నం చేశారని, కేవలం మత కారణాల వల్లే తనను పూర్తిగా ఒంటరి చేశారని చెప్పాడు.
షాహిద్ అఫ్రిదిపై తీవ్ర విమర్శలు
డానిశ్ కనేరియా తనపై జరిగిన వివక్షలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిని ప్రధాన కారణంగా పేర్కొన్నాడు. “అఫ్రిది ఎప్పుడూ నన్ను మతం మారమని ఒత్తిడి చేసేవాడు. అతను క్రికెట్ కంటే కూడా మతాన్ని ఎక్కువగా ప్రచారం చేసేవాడు. నా జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టిన వ్యక్తి అతనే,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.అఫ్రిదితో పాటు మరికొందరు క్రికెటర్లు కూడా తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, తనతో కలిసి భోజనం చేయటానికి కూడా ఇష్టపడేవారు కాదని చెప్పాడు. కానీ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం తనకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. “ఇంజమామ్ హక్కీ నిజమైన కెప్టెన్. అతను ఎప్పుడూ నా మతాన్ని మారమని ఒత్తిడి చేయలేదు. నన్ను గౌరవంగా చూసేవాడు,” అని పేర్కొన్నాడు.

పాక్ తరఫున కీలక ఆటగాడు
డానిశ్ కనేరియా పాకిస్థాన్ జట్టుకు 61 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. తన స్పిన్ బౌలింగ్‌తో పాక్ జట్టుకు అనేక విజయాలను అందించాడు. అయితే, అతని కెరీర్ అనూహ్యంగా ముగిసింది. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో క్రికెట్ కెరీర్ పూర్తిగా దెబ్బతిన్నది.అయితే, కనేరియా తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను ఎప్పుడూ నేరుగా అంగీకరించలేదు. తన కెరీర్‌ను కావాలని నాశనం చేశారని చెప్పుకొచ్చాడు. “నేను మరికొంత కాలం క్రికెట్ ఆడే స్థాయిలో ఉన్నాను. కానీ వివక్ష, కుట్రల కారణంగా నా కెరీర్‌ను నాశనం చేశారు,” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
పాక్ క్రికెట్‌లో వివక్ష
డానిశ్ కనేరియా చేసిన ఆరోపణలు కొత్తవి కావు. పాకిస్థాన్ క్రికెట్‌లో మైనారిటీలకు తగిన గౌరవం లభించదని గతంలోనూ పలువురు పేర్కొన్నారు. పాక్ జట్టులో ముస్లిం క్రీడాకారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, మైనారిటీలను పట్టించుకునేది లేదని పలువురు విమర్శించారు.ఇంతకుముందు మాజీ పాక్ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. “కనేరియా ఒక మంచి బౌలర్. కానీ మత వివక్ష కారణంగా అతన్ని జట్టులో అంతగా ప్రోత్సహించలేదు,” అని చెప్పాడు.