బీఆర్ఎస్ రజతోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ సభను ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిన్న రాత్రి హరిత కాకతీయలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వరంగల్‌కు బీఆర్ఎస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని, అందుకే ఈ ప్రత్యేకమైన సభను అక్కడే నిర్వహించాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి అనువైన రెండు స్థలాలను పరిశీలించామని, త్వరలోనే ఒక ప్రదేశాన్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
హరీష్ రావు మాట్లాడుతూ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని, కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని మార్గదర్శకంగా తీసుకుంటోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అంకితభావంతో పని చేస్తోందని, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయని చరిత్ర కలిగి ఉందని, అయితే కేసీఆర్ సర్కార్ హామీ ఇవ్వకపోయినా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించిందని హరీష్ రావు పేర్కొన్నారు.
హరీష్ రావు వ్యాఖ్యలు
తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తుక్కు తుక్కు ఓడిపోయారని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎన్నికలలో కూడా ఓటమిపాలు కావడం ఖాయమని హరీష్ రావు జోస్యం చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పనితీరును తీవ్రంగా సమీక్షిస్తున్నారని, రేవంత్ రెడ్డి పాలన ప్రజా నమ్మకాన్ని పోగొట్టిందని అన్నారు. కాంగ్రెస్‌కు ఎదురైన ఈ ఓటమి రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యానికి ఒక రకమైన రిఫరెండంగా మారిందని ఆయన అన్నారు.

డీకే అరుణ, ఈటెల రాజేందర్‌లను మీరే గెలిపించారా? అంటూ హరీష్ రావు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మోదీ మంచోడని, కిషన్ రెడ్డి చెడ్డవాడని రేవంత్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేస్తూ, “అయితే రాహుల్ గాంధీ కూడా చెడ్డవాడేనా?” అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు.
వ్యక్తిగత వ్యాఖ్యలపై కౌంటర్
తాను పొడుగరిగా పుట్టడం తన తప్పు కాదని, దాని గురించి కూడా భట్టి విక్రమార్క మాట్లాడితే అది వారి “కురచ బుద్ధి“కు నిదర్శనం అని హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ విభేదాలే ఉంటాయి గానీ వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ
వరంగల్‌లో రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభలో లక్షలాది మంది పాల్గొంటారని హరీష్ రావు ప్రకటించారు. గత 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సమ్మిళితంగా ఈ సభ తెలంగాణ అభివృద్ధి దిశలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.సభ విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ క్యాడర్ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభను కీలకంగా మార్చేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.