ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త రికార్డు సృష్టించింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సినిమా రూ. 1870 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

పుష్ప 2 పై హైకోర్టులో పిల్ దాఖలు
అయితే, ఈ భారీ వసూళ్లు సాధించిన పుష్ప 2 సినిమా లాభాలను జానపద కళాకారుల సంక్షేమం కోసం వినియోగించాలని కోరుతూ న్యాయవాది నరసింహారావు తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక బెనిఫిట్ షోలు నిర్వహించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన కారణంగా ఈ సినిమా భారీ లాభాలను ఆర్జించిందని ఆయన కోర్టుకు వివరించారు. ఈ కేసులో న్యాయవాది నరసింహారావు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, పుష్ప 2 చిత్రానికి ప్రత్యేకంగా రాష్ట్ర హోంశాఖ అనుమతిని మంజూరు చేసి టికెట్ రేట్లను పెంచే అవకాశం కల్పించింది. దీంతో సాధారణ ప్రేక్షకుల మీద అదనపు భారం పడిందని, అందువల్ల ఆ లాభాలను ప్రజల ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సినిమా లాభాలను జానపద కళాకారుల పింఛన్, చిన్న సినిమాల అభివృద్ధికి వినియోగించాలనే డిమాండ్‌ను న్యాయవాది నరసింహారావు కోర్టుకు వినిపించారు. అలాగే, సుప్రీం కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉదాహరణగా చూపిస్తూ, ప్రజల డబ్బుతో లాభాలను అందుకున్న సినిమాలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని కోర్టును కోరారు.
హైకోర్టు స్పందన
ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పుష్ప 2 చిత్రానికి టికెట్ రేట్లు పెంచడానికి ప్రత్యేక అనుమతులిచ్చిన నేపథ్యంలో, ఆ ఆదాయాన్ని ఎలా వినియోగించాలి అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించేందుకు రెండు వారాల గడువిస్తామని, అప్పటికి సంబంధిత సుప్రీంకోర్టు తీర్పు, ఇతర ఆధారాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ పిటిషన్ దాఖలు కావడంతో సినిమా ఇండస్ట్రీలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. నిర్మాతల మండలి, సినీ వర్గాలు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది దీనిని అవసరమని చెబితే, మరికొంత మంది దీనిని సినిమా రంగంపై అనవసర ఒత్తిడి అని అభివర్ణిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, ప్రీమియర్ షోల ద్వారా డిసెంబర్ 4వ తేదీ నుంచే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వంటి ప్రత్యేక అనుమతులతో మొదటి రోజు నుంచే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. పుష్ప 2 లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని కోర్టులో పిటిషన్ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుతో భారీ ఆదాయం హైకోర్టు విచారణ రెండు వారాలకు వాయిదా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ హైక్స్ కి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులిచ్చారు. ప్రీమియర్స్ తోనే భారీ కలెక్షన్స్ సాధించింది ఈ చిత్రం.