అమెరికాలో కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లో ని హిందూ దేవాలయం పై కొంతమంది గుర్తుతెలియని దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఈ తరహా ఘటనల్లో ఇది మూడోది.భారత ప్రభుత్వం ఈ దాడి పై తీవ్రంగా ఖండించింది. ఈ విధ్వంసక చర్యలకు పాల్పడిన దోషులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే, ప్రార్థనా స్థలాలకు తగిన భద్రత కల్పించాలని స్థానిక అధికారులను కోరింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “కాలిఫోర్నియాలోని చినో హిల్స్ హిందూ ఆలయంలో విధ్వంసానికి సంబంధించిన నివేదికలను మేము పరిశీలించాము. ఇలాంటి నీచమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని అన్నారు.
బాప్స్ సంస్థ స్పందన
ఈ దాడిపై బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ ( బాప్స్) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక నినాదాలు రాయడం, ఆలయాన్ని అపవిత్రం చేయడం తీవ్ర నిరసనలకు దారితీసింది.బాప్స్ పబ్లిక్ అఫైర్స్ విభాగం ఓ అధికారిక ప్రకటనలో, “ఈ విధ్వంసక చర్యల నేపథ్యంలో హిందూ సమాజం ద్వేషానికి వ్యతిరేకంగా దృఢంగా నిలుస్తుంది. చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని సమాజంతో కలిసి మేము ద్వేషాన్ని వ్యతిరేకిస్తాము” అని పేర్కొంది.
భద్రతా చర్యలు
భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని ఈ ఘటనపై గట్టిగా స్పందించాలని కోరింది.దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసింది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను పెంచాలని కోరింది.అమెరికాలోని హిందూ సమాజానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతేడాది సెప్టెంబర్ నెలలో క్యాలిఫోర్నియాలోని సాక్రామెంటోలో బాప్స్ (బొచ్చసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ) దేవాలయంపై దాడి జరిగింది. అంతకంటే కొద్దిరోజుల ముందే న్యూయార్క్ లోని మెల్విలెలోని మరో బాప్స్ దేవాలయంపై కూడా దాడి జరిగింది.చినో హిల్స్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరం పై దాడి జరిగినట్లు సమాచారం. ఆలయ గోడలపై అనుచితమైన నినాదాలు రాయడం, మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది.