లటాకియా : ఇస్లామిక్ దేశం సిరియా లో తిరుగుబాటుదారుల ఆక్రమణతో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. అనంతరం అబూ మొహమ్మద్ అల్-జౌలానీ తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల శాంతి తర్వాత సిరియాలో మళ్ళీ హింస మొదలైంది. సిరియా పశ్చిమ తీర ప్రాంతం లటాకియా ప్రావీన్సు లో శుక్రవారం సిరియన్ భద్రతా దళాలు, మాజీ ప్రెసిడెంట్ అసద్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరిగింది.

అనేక మది తీవ్ర గాయాలు
ఈ ఘటనలో 70 మంది మరణించగా, అనేక మది తీవ్రంగా గాయపడినట్టు పలు కథనాలు వెల్లడించాయి. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. లటాకియా ప్రావిన్స్‌లోని జబ్లే పట్టణంలో హింస చెలరేగగా అసద్ మద్దతు దారులను తరిమికొట్టడానికి భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. మృతుల్లో 35 మంది భద్రతా సిబ్బంది, 32 మంది అసద్ విదేయులు, ముగ్గురు పౌరులు ఉన్నారు.
వేలాది మంది నిరసనకారులు
అసద్ మాజీ కమాండర్ సుహీల్ అల్-హసన్‌తో సంబంధం ఉన్న ముష్కరులు సెక్యురిటీ చెక్ పోస్టులపై దాడి చేయడంతో ఘర్షణలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. లటాకియా, టార్టస్‌లలో వేలాది మంది నిరసనకారులు మరోసారి వీధుల్లోకి వచ్చి కొత్త ప్రభుత్వ సైన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. వారు ప్రభుత్వ దళాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అసద్ పదవి నుంచి తొలగించబడిన తర్వాత అత్యంత హింసాత్మక ఘటన ఇదే కావడం గమనార్హం.