తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వయం సహాయక సంఘాల ‘ఇందిరా మహిళా శక్తి’ భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ మహిళలకు ప్రోత్సాహక పథకాలు, ఆర్థిక సహాయాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు రైస్ మిల్లులు, గిడ్డంగులు
ప్రభుత్వమే స్థలం కేటాయించి ప్రతి మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గిడ్డంగులు ఏర్పాటు చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుండి రుణాలు పొందే వీలును కల్పించి, ఆ వడ్లను మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నేరుగా లీజుకు ఇవ్వకుండా మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను అందజేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే 150 బస్సులు ప్రారంభించామని, రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు మహిళలు యజమానులు కాబోతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం మహిళా సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్యను కోటికి చేరుస్తామని తెలిపారు. సభ్యత్వ పరిమితిని సడలిస్తూ కనిష్ట వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించారు. గరిష్ట పరిమితిని 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించనుందని, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మహిళలకు రాజకీయ ప్రోత్సాహం
రాబోయే ఎన్నికల్లో 33 శాతం మహిళలను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకోవాలని సీఎం ఆకాంక్షించారు. మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని, నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. మహిళా సంఘాలకు మరిన్ని నిధులు కేటాయిస్తూ, ప్రతి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి భవనాల కోసం రూ. 25 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2,82,552 సంఘాలకు సంబంధించి రూ. 22,794 కోట్ల చెక్కులను అందజేశారు. మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి శిల్పారామం పక్కన 150 షాపులు కేటాయించామని, మహిళా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మహిళా సంక్షేమానికి కొత్త పథకాలు – స్వయం సహాయక సంఘాల ప్రోత్సాహం: సోలార్ ప్లాంట్స్, కార్పొరేట్ మార్కెటింగ్. రైస్ మిల్లులు, గిడ్డంగులు: ప్రతి మండలంలో ఏర్పాటు. 1000 ఎలక్ట్రిక్ బస్సులు: మహిళలకు యాజమాన్య హక్కులు. సభ్యత్వ మార్పులు: 15-65 ఏళ్ల మహిళలకు అవకాశం. సహాయక నిధులు: రూ. 22,794 కోట్ల చెక్కులు పంపిణీ. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తయారు చేయాలి. ఆడబిడ్డలు ఎదిగితేనే అది సాధ్యపడుతుంది. ఈ ప్రకటనలతో తెలంగాణ మహిళలకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుంది. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి, వ్యాపార రంగంలో ముందుకు రావడానికి ఈ పథకాలు దోహదపడతాయి