హైదరాబాద్: ప్రముఖ నటుడు,రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఓబులవారిపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో పోసాని తరుఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. దీంతో పోసానికి ఊరట లభించినట్లైంది.

కడప మొబైల్ కోర్టు డిస్మిస్
అయితే కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. నరసరావుపేట, ఆదోని కోర్టుల్లో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేసినా జైలుకే పరిమితమవుతారు. ఆయన పైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు పోసాని కస్టడీ పిటిషన్‌ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు పోసాని కృష్ణమురళి కస్టడీకి నరసరావుపేట కోర్టు అనుమతించింది. రెండు రోజుల కస్టడీకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు నరసరావుపేట టూ టౌన్ పోలీసులు పోసానిని విచారించనున్నారు.
పిటిషన్ ని సోమవారానికి వాయిదా
ఈ నెల 13వ తేదీ వరకు నరసరావుపేట కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోసాని కృష్ణమురళిని విచారించాల్సిన అవసరం ఉందని జడ్జి ముందు వాదనలు వినిపించారు ప్రభుత్వ న్యాయవాదులు. కేసులో ఛార్జ్ షీట్ వేశారని, పోసాని కృష్ణమురళిని విచారించాల్సిన అవసరం లేదంటూ వాదనలు వినిపించారు పోసాని తరపు న్యాయవాదులు. ఇక, పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటీషన్ పై వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ ని సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది నరసరావుపేట కోర్టు.