అమరావతి: ఏపీలో ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి శాసనసభలో పద్దుపై చర్చ జరుగనుంది. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు పాఠశాలలకు ప్రహరీగోడల నిర్మాణం,వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లు, వక్ఫ ఆస్తుల రికార్డుల డిజిటైజేషన్, డీఎస్స్సీ నోటిఫికేషన్, శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ తదితర అంశాలపై చర్చించనున్నారు. గిరిజన యువతకు ఉపాధి, గోదావరి పుష్కరాలు, మహిళలు-చిన్నారులపై అఘాయిత్యాలు, మాదకద్రవ్యాల వినియోగం, గోదావరి డెల్టా సాగునీటి కాలువల నిర్వహణ అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇస్తారు.

వివిధ అంశాలపై ప్రశ్నలకు సమాధానం
మరోవైపు శాసనమండలిలో ఈరోజు బడ్జెట్‌పై తొలిరోజు చర్చ జరుగనుంది. శాసనమండలిలో నేటి ప్రశ్నోత్తరాల్లో పులివెందుల గృహనిర్మాణ పథకంలో అక్రమాలు, పోర్టుల నిర్మాణం,ఏపీఎండీసీ వాటాల విక్రయం, పేదలకు ఇళ్లస్థలాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. కోళ్లకు వైరస్, మండల పరిషత్‌లు – గ్రామపంచాయితీల్లో నిధుల దుర్వినియోగం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెవెన్యూ సదస్సులు, ఆరోగ్యశ్రీ పథకం తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
ఏపీ బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల మార్కు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం నాడు అసెంబ్లీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏపీ బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. రూ.48,341 కోట్లతో వ్యవసాయ పద్దును ఆ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు పద్దులో విస్తృత కసరత్తు చేశారు.