దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతిచెందారు. మొదటి అంతస్తులోని ఓ గదిలో చిక్కుకున్న ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతులను సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు.

మూడు గ్యాస్ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత
తొలుత భవనంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న లంగర్ హౌస్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? మంటలు ఎందుకు వ్యాపించాయనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదం నుంచి మరో ఐదుగురిని కాపాడారు. భవనంలో మూడు గ్యాస్ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు కావొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు అదుపు చేస్తున్నాం.
అగ్నిమాపక శాఖ తెలిపినదని ప్రకారం..ఈ సాయంత్రం దాదాపు 5.30గంటల సమయంలో మాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు అదుపు చేస్తున్నాం. పైన ఐదుగురు చిక్కుకున్నట్లు చెప్పడంతో లాడర్ వేసి డోర్‌లు పగలగొట్టి లోపలికి ప్రవేశించాం. అక్కడ ఒక పాప, ఇద్దరు మహిళలు అపస్మారకస్థితిలో ఉండటంతో వారిని స్ట్రెచర్‌పై తీసుకొచ్చి.. అంబులెన్సులో ఆస్పత్రికి తరలించాం అని అగ్నిమాపకశాఖ అధికారి ఒకరు తెలిపారు.