ప్రపంచ ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తన సంపదలో భారీ కోతను చవిచూశారు. మంగళవారం నాడు టెస్లా షేర్లు భారీగా క్షీణించడంతో ఒక్కరోజులోనే ఆయన సంపద ఏకంగా 22.2 బిలియన్ డాలర్లకు (రూ. 1.91 లక్షల కోట్లకు) పైగా నష్టపోయింది. వరుసగా నాలుగో రోజు కూడా టెస్లా స్టాక్ విలువ పడిపోవడం వల్ల ఆయన నికర సంపద భారీగా తగ్గిపోయింది.
పతనానికి కారణం
టెస్లా షేర్ల పతనానికి ప్రధాన కారణంగా యూరప్‌లో టెస్లా కార్ల అమ్మకాలు భారీగా పడిపోవడం చెప్పుకోవచ్చు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే, 2024 జనవరిలో యూరప్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 45% మేర తగ్గిపోయాయి. ఈ సమయంలో యూరప్‌లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల (ఇవిఎస్) అమ్మకాలు పెరిగినా, టెస్లా విక్రయాలు మాత్రం తీవ్రంగా పడిపోవడం మార్కెట్ నష్టానికి దారితీసింది.న్యూయార్క్ లో టెస్లా షేర్లు మంగళవారం నాడు 8.4% క్షీణించాయి, ఫలితంగా కంపెనీ మొత్తం విలువ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. గతేడాది నవంబర్ 7 తర్వాత టెస్లా ఈ స్థాయిలో మార్కెట్ లాస్ చూసింది.

సంపదపై ప్రభావం
ఎలాన్ మస్క్ సంపదలో సగానికి పైగా వాటా టెస్లా షేర్ల రూపంలోనే ఉంది. టెస్లా మార్కెట్ విలువ తగ్గడం వల్ల మస్క్ సంపదలో భారీ నష్టం సంభవించింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనైర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ సంపద ఒక్క రోజులోనే 22.2 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ఇది భారతీయ కరెన్సీలో రూ. 1.91 లక్షల కోట్ల నష్టానికి సమానం.
ఇంతకు ముందు, జనవరిలో టెస్లా కంపెనీ చివరి త్రైమాసికం ఫలితాలను ప్రకటించినప్పటి నుంచి కంపెనీ షేర్లు 25% వరకు క్షీణించాయి. కంపెనీ వృద్ధి రేటు తక్కువగా ఉండటం, ఆటోమొబైల్ పరిశ్రమలో పెరుగుతున్న పోటీ, చైనాలో వంటి కంపెనీల బలమైన పోటీ కారణంగా టెస్లా స్టాక్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
టెస్లా షేర్లు పడిపోతున్నప్పటికీ, ఎలాన్ మస్క్ కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, బోరింగ్ కంపెనీ వంటి సంస్థలు మంచి వృద్ధి నమోదు చేస్తున్నాయి. అంతేకాదు, టెస్లా కూడా నూతన మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, టెస్లా షేర్లపై ఒత్తిడి తాత్కాలికమే కాని, దీర్ఘకాలికంగా కంపెనీ స్థిరపడే అవకాశం ఉంది. టెస్లా రాబోయే త్రైమాసిక ఫలితాలు, కొత్త వాహనాల ఆవిష్కరణ, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో మార్పులు కంపెనీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.