హిందూ ధర్మంలో పవిత్రమైన మంత్రాల్లో ‘ఓం నమశ్శివాయ’ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం గా పిలుస్తారు, ఎందుకంటే దీనిలో ‘న, మ, శి, వా, య’ అనే ఐదు అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాల వెనుక ఉన్న గాఢమైన ఆధ్యాత్మిక రహస్యం, ప్రకృతితో దాని అనుబంధం, శివుని మహిమను తెలియజేస్తాయి. ఈ మంత్రాన్ని జపించటం ద్వారా భక్తికి, జ్ఞానానికి మార్గం సుగమమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

‘నమశ్శివాయ’ అనే ఈ మంత్రంలోని ప్రతి అక్షరానికి ప్రత్యేకమైన అర్థం ఉంది.
‘న’ అంటే నభం – ఆకాశాన్ని సూచిస్తుంది.
‘మ’ అంటే మరుత్ – గాలిని సూచిస్తుంది.
‘శి’ అంటే శిఖి – అగ్నిని సూచిస్తుంది.
‘వా’ అంటే వారి – నీటిని సూచిస్తుంది.
‘య’ అంటే యజ్ఞం – భూమిని సూచిస్తుంది.
ఈ ఐదు అక్షరాలు పంచభూతాలను ప్రతిబింబిస్తాయి. భగవంతుడిని పంచభూతాల రూపంలో దర్శించుకునే భారతీయ సనాతన సంస్కృతిని ఈ మంత్రం ప్రతిబింబిస్తుంది.
ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వలన మనస్సు శాంతి పొందుతుంది. పంచభూతాలు సమతుల్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది శరీరానికి, మనస్సుకు శక్తిని ప్రసాదించి, శివతత్వాన్ని గ్రహించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే, ‘ఓం నమశ్శివాయ’ మంత్రాన్ని శివభక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పఠిస్తారు.