ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన పార్టీ సీనియర్ నేతలతో ఉండవల్లిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నందున టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఓటరును సంప్రదించాలని సూచించారు. ఎన్నికల ముందు రోజు మహాశివరాత్రి పండుగ కావడంతో, ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు మంత్రులు, శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు
ఎన్నికల రోజున కేంద్ర కార్యాలయం నుంచి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆదేశించారు. అన్ని పార్టీ నాయకులు సమిష్టిగా కృషి చేసి, అభ్యర్థుల ఘన విజయాన్ని సాధించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలి
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, సమన్వయంతో పని చేయడం ద్వారా విజయం సాధించగలమని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలని, కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేసి, ఎన్నికలలో విజయాన్ని ఖాయం చేయాలని పిలుపునిచ్చారు