ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని.. హామీల అమలుకు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదని విమర్శించారు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదమన్నారు. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని.. బీజేపీని ఆదరించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గిందన్నారు.

గతంలో అనేక సార్లు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు
ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుందని తెలిపారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని.. రిజర్వేషన్‌లను స్వాగతిస్తామని చెప్పారు. కానీ ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తామన్నారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో అనేక సార్లు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.