ప్రముఖ తెలుగు నిర్మాత ఎస్కేఎన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా, ఇటీవల ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీశాయి. తెలుగు హీరోయిన్ల గురించి అతను చెప్పిన మాటలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, వివాదం మరింత ముదరకముందే ఎస్కేఎన్ తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు.ఎస్కేఎన్ సినీ ఇండస్ట్రీలో కొత్త కాదని, పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ‘బేబీ’ సినిమాతో ఆయనకు భారీ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో ఎస్కేఎన్ పెద్ద స్థాయిలో ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి అతని ప్రతి చిన్న వ్యాఖ్య కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.
బెట్టింగ్ యాప్‌లపై హెచ్చరిక
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎస్కేఎన్ తాజాగా ఒక ఆసక్తికర పోస్టును షేర్ చేశారు. బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడొద్దని, ఎవరూ వీటిని ప్రమోట్ చేయద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.‘ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకున్నామని సహాయం కోసం అభ్యర్థిస్తున్న వ్యక్తులు చాలా తక్కువ. సోదరులారా దయచేసి ఈ యాప్‌లతో జాగ్రత్తగా ఉండండి. సులభంగా డబ్బు వస్తుందని ఆశపడకండి. ఈ యాప్‌లు దోచుకోవడానికి రూపొందించబడ్డాయి కానీ మీకు ఎలాంటి సహాయం చేయవు. దయచేసి మీరు ఈ ఉచ్చులో పడకండి.కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోకండి అని ఎస్కేఎన్ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.
ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన వివాదాలు ఎన్నో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీటి ప్రభావంతో యువత ఆర్థికంగా నష్టపోవడం, అప్పుల ఊబిలోకి వెళ్లడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా ఇటీవల కొందరు ఫేమస్ యూట్యూబర్లు అదే పనిగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు. వీటి మాయాలో పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై అవగాహన కల్పిస్తున్నారు.
సజ్జనార్ ఆగ్రహం
ఓ వ్యక్తి సోషల్ మీడియా లో వీడియో పోస్ట్ చేసారు. దాని పై తెలంగాణ ఆర్టిసి ఎండి సజ్జనార్ స్పందించారు .బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మీరు డబ్బు సంపాదించుకోవాలంటే చాలా మార్గాలున్నాయి.ఇవేం దిక్కుమాలిన పనులు. మీ టాలెంట్ ను చాలా రంగాల్లో ఉపయాగించుకుని సంపాదించుకోవడం లో తప్పు లేదు. ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ బానిసలను చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి అని వార్నింగ్ ఇచ్చారు.
ఆన్లైన్ వేదికగా జరిగే బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు కొందరు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారంటూ, బెట్టింగ్‌కు బానిసై భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అంటూ సందేశాన్ని ఇచ్చారు. తమ వ్యక్తి గత స్వార్థం కోసం ఎంతో మందిని ఆన్లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఇలాంటి వీడియోలకు ఆకర్షితులు కావద్దని సూచించారు.