ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి యూట్యూబ్‌కు నోటీసులు అందాయి. ఈ క్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన వీడియోను యూట్యూబ్ తొలగించింది. దీంతో రణ్‌వీర్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పలువురు నాయకులు అతనిపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు.
ప్రియాంక చతుర్వేది స్పందన
ఈ అంశం పై తాను పార్లమెంటులో మాట్లాడుతానని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. కామెడీ కంటెంట్ పేరుతో భాషా పరిమితులు దాటడం సరికాదన్నారు. ఒక వేదికపై మీకు అవకాశం లభించినంత మాత్రాన ఏదైనా మాట్లాడవచ్చని కాదన్నారు.రణ్‌వీర్‌కు ఎంతోమంది ఫాలోవర్లు ఉన్నారని, అనేకమంది రాజకీయ నాయకులు అతని పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారని ఆమె తెలిపారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని ఆమె స్పష్టం చేశారు.
యూట్యూబర్ రణ్‌వీర్ ఇలహాబాదియా వివాదాస్పద వ్యాఖ్యలు – సీఎం ఫడ్నవీస్ తీవ్ర స్పందన
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, యూట్యూబర్ రణ్‌వీర్ ఇలహాబాదియా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో తల్లిదండ్రుల శృంగారంపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రణ్‌వీర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.ఈ విషయంపై సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ, “నిజమైన వాక్ స్వాతంత్రం అనేది ఇతరుల హక్కులను కించపరచకుండా ఉండాలి. సామాజిక నిబద్ధతలను తేలిగ్గా తీసుకోవడం సమాజానికి హానికరం” అని హెచ్చరించారు.
రణ్‌వీర్ క్షమాపణలు:
తాను చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని, వాటిలో ఎలాంటి హాస్యమూ లేదని రణ్‌వీర్ ఇలహాబాదియా అన్నారు. కామెడీ చేయడం తన బలం కాదని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తన ఛానల్‌ను ప్రచారం చేసుకోవాలని తాను అనుకుంటున్నట్లుగా చాలామంది భావిస్తున్నారని, కానీ అలాంటి ఉద్దేశం తనకు లేదన్నారు. చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.

యూట్యూబ్ మాదిరిగా ఇతర సామాజిక మాధ్యమాలు కూడా ఇలాంటి అనుచిత కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను కఠినతరం చేయాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. రణ్‌వీర్ ఇలహాబాదియా వ్యవహారం కేవలం యూట్యూబ్ కంటెంట్ పరిమితుల్లో కాకుండా, సమాజంపై డిజిటల్ మీడియా ప్రభావాన్ని గురించి సుదీర్ఘ చర్చకు దారితీసేలా ఉంది.