ప్రముఖ నటుడు, మానవతావాది సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. కోర్టు సమన్లకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు నేపథ్యంలో సోనూసూద్ పేరు ప్రస్తావనలోకి రావడం గమనార్హం. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తిని రూ. 10 లక్షలు మోసం చేశాడని ఆరోపణలున్నాయి. బాధితుడు రాజేశ్ అనే లాయర్ ఈ కేసును న్యాయస్థానంలో దాఖలు చేశారు.

రాజేశ్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, ఈ వ్యవహారంలో సోనూసూద్ కీలక సాక్షిగా ఉన్నట్లు పేర్కొన్నారు. కోర్టు పంపిన నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో, జడ్జి దీనిపై తీవ్రంగా స్పందించి అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.
సోనూసూద్ పై ఇటువంటి ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పాండమిక్ సమయంలో వేలాదిమందికి సహాయహస్తం అందించిన ఆయనకు పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉంది. అయితే, ఈ కేసులో ఆయన నిజంగా సంబంధం ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సోనూసూద్ దీనిపై ఎలా స్పందిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. కేసు విచారణలో కొత్త మలుపులు ఎలా ఉంటాయనేదే ఇప్పుడు అందరి ఆసక్తి.