పశ్చిమ బెంగాల్‌లోని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో మహిళా ప్రొఫెసర్ ఓ విద్యార్థితో పెళ్లి చేసుకోవడం వైరలైన విషయం తెలిసిందే. ఈ ఘటన వర్సిటీలోని సైకాలజీ డిపార్ట్ మెంట్ లో జరిగింది. మహిళా ప్రొఫెసర్ పెళ్లికూతురిలా ముస్తాబు కాగా, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పెళ్లి కొడుకులా తయారయ్యాడు. ఇద్దరు పూల దండలు మార్చుకుని, కుంకుమ పెట్టుకున్నారు. హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ పెళ్లిని ఎంజాయ్ చేస్తూ, వారిని ఉత్సాహపరిచారు.ఈ ఘటనకు సంబంధించి జనవరి 9న హల్దీ వేడుక జరగగా, జనవరి 14న మెహందీ, సంగీత్ నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇన్విటేషన్ కూడా తయారు చేశారు. ఈ పెళ్లి తంతు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో స్పందించిన వర్సిటీ యంత్రాంగం విచారణకు ఆదేశించింది. అలాగే ఆమెను అధికారులు సెలవుపై పంపారు.

ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ తాజాగా తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, విధుల్లో కొనసాగలేనని ఆమె పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై విశ్వవిద్యాలయం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఆ పెళ్లి తంతు ఓ ప్రాజెక్టులో భాగమని ప్రొఫెసర్ చెబుతున్నారు.
ఈ వీడియోను నాడియా జిల్లాలో ఎంఏకేఏయూటీలోని హరిన్‌ఘాటా క్యాంపస్ తరగదిలో చిత్రీకరించారు. అయితే డాక్యుమెంటేషన్ కోసం వీడియో చిత్రకరించినట్లుగా ప్రొఫెసర్ తెలిపారు. అయితే ఒక ప్రొఫెసర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి రచ్చ చేశారని ఆమె ఆరోపించారు. తన కెరీర్‌ను దెబ్బతీయడానికి.. తనను కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా సహోద్యోగి లీక్ చేశారని ఆమె పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.