చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. రైతుల విషయంలో పనులు ఆలస్యం కాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవలే అకాల వర్షాలవల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన పడుతుంటే అందులో 25 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ, రైతులకు డబ్బుల చెల్లింపులు తదితర విషయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో అన్నదాతలకు దాదాపు రూ.5,900 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు.

2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపుల గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. డబ్బులు చెల్లించడంవల్ల ఆరు లక్షల మంది రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని, గత ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకుండా అన్నదాతలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే అన్నారు. ధాన్యం సేకరించినప్పటికీ డబ్బులు మాత్రం చెల్లించకపోవడంతో ఎంతోమంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వానికి రైతులంటే ఎంతో గౌరవమని, రైతులకు మొదటి ప్రాధాన్యమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే పశు కిసాన్ క్రెడిట్ కార్డుద్వారా రైతులు పశుగ్రాసం కోసం రుణాన్ని పొందొచ్చు. పశువుల మేత కొనుగోలు బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి అని, దరఖాస్తు చేస్తున్న రైతులకు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనగుణంగా రుణాన్ని మంజూరు చేస్తామన్నారు. తమకు పశువులు ఉన్నట్లుగా పశు వైద్య అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలి అని మంత్రి తెలిపారు.