ఢిల్లీలో రాజకీయాల వేడి పుట్టిస్తున్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 4వ తేదీ జరుగుతుంది. ఇప్పటికే ఇటు అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మొత్తం 70 స్థానాలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు శుక్రవారం జనవరి 17 చివరితేదీ కావడంతో అభ్యర్థుల కోలాహలం మామూలుగా లేదు. ఇక సామాన్యుడి పార్టీలో అత్యంత ప్రాధాన్యత గల వ్యక్తుల ఆస్తులు వారి వివరాలు అఫిడవిట్లో పొందుపర్చిన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ముందుగా అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల చిట్టాను గమనిద్దాం.

అరవింద్ కేజ్రీవాల్‌కు సొంత కారు లేదా..? అవును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికీ సొంత కారు లేదు అంటే నమ్మగలరా.. యస్.. నమ్మి తీరాల్సిందే. కేజ్రీవాల్ తన కుటుంబ ఆస్తుల లెక్క రూ.4.2 కోట్లుగా డిక్లేర్ చేశారు. ఇందులో ఆయన వ్యక్తిగత ఆస్తులు రూ.1.73 కోట్లుగా ఉన్నాయి.
ఇందులో సేవింగ్స్ అకౌంట్లో రూ.2.96 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇక చేతిలో నగదు రూ.50వేలు ఉందని ,FDR, టర్మ్ డిపాజిట్, ఎస్బీఐలో సేవింగ్స్ రూపంలో రూ.2.8 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఇక ఢిల్లీ మాజీ సీఎంకు ఒక సొంత కారు, ఇల్లు లేదని స్పష్టం చేశారు.
ఢిల్లీ సీఎం అతిషీ వద్ద బంగారం ఢిల్లీ సీఎం అతిషీ సింగ్ జనవరి 14న కల్కాజీ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేసింది. తాను డిక్లేర్ చేసిన ఆస్తుల ప్రకారం చరాస్తుల విలువ రూ.76.93 లక్షలుగా ఉంది. చేతిలో నగదు రూ.30వేలు ఉండగా, రూ. లక్ష విలువ చేసే నగలున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాలో రూ.75 లక్షలు ఉన్నట్లు స్పష్టం చేశారు.