సౌత్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ సాయి పల్లవి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో వరుస హిట్లతో క్రేజ్ సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాలో సాయి పల్లవి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, యష్ వంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.గత ఏడాది ‘అమరన్’ సినిమాతో సాయి పల్లవి పెద్ద విజయాన్ని అందుకున్నారు.

శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఆమె అక్కినేని నాగచైతన్య సరసన ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో జన్మించిన సాయి పల్లవి, జార్జియాలో వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి, వెండితెరపైకి రాకముందు బుల్లితెరపై డ్యాన్స్ పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు.’ప్రేమమ్’ సినిమా సూపర్ హిట్ కావడంతో, మలయాళంలో వరుస సినిమాల్లో అవకాశాలు అందుకున్న సాయి పల్లవి, 2018లో ‘కరు’ సినిమా ద్వారా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టారు.
తెలుగు ప్రేక్షకులను మాత్రం ‘ఫిదా’ సినిమాతో కనువిందు చేశారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నారు.ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించిన సాయి పల్లవి, ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ కథలపైన ఆసక్తి చూపుతున్నట్లు టాక్. త్వరలోనే ఆమె మహిళా ప్రాధాన్య కథా చిత్రాల్లో నటించబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు కూడా అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి కొత్త ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి.