ప్రముఖ వ్యాపారవేత్త అదానీ సంపద కేవలం మంగళవారం ఒక్కరోజునే రూ.61,192 కోట్లు పెరిగింది. అదానీ గ్రూప్ ప్రస్తుతం దేశంలో అనేక కీలక రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉంది. పోర్టుల నుంచి విమానాశ్రయాల వరకు సిమెంట్ నుంచి సోలార్ పవర్ వరకు ఇందుగలను అందులేను అన్నట్లుగా అదానీ దూకుడు కొనసాగుతోంది. పైగా గతంలో కంటే చాలా వేగంగా వ్యాపారాలను ముందుకు నడిపించటంతో ఆయన సంపద కూడా అంతే స్పీడుగా పెరిగిపోతోంది.

అయితే అందరికీ అంతుచిక్కని విషయం ఏమిటంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా సులువుగా అదానీ వాటిని ఎలా అధిగమించి ముందుకు సాగుతున్నారు అన్నదే. ఈ బిలియనీర్ ఇటీవల కుంభమేణాలో అన్నదానం చేయటానికి కూడా ఇస్కాన్ సంస్థతో జతకట్టిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఒక్క రోజులో అదానీ కెరటంలా నష్టాల నుంచి సంపదను పెంచుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి సోమనారం ఆయన సంపద 5.06 బిలియన్ డాలర్లు క్షీణించగా.. తిరిగి మంగళవారం 7.47 బిలియన్ డాలర్లు పెరగటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
20 మంది సంపన్నుల జాబితాలోకి చోటు
దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదికలోని టాప్-20 మంది సంపన్నుల జాబితాలోకి ఆయన తిరిగి చోటు సంపాదించుకున్నారు. దీంతో ఒక్కరోజులోనే అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 22వ స్థానం నుంచి 20వ స్థానానికి తిరిగి వచ్చారు. ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా లాభపడటం దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.