ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిని శివసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ‘ఇండియా’ బ్లాక్, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) పొత్తులు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకేనని అన్నారు. కాగా, శివసేన (యూబీటీ) భాగమైన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌పై ఆయన మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ కూటమి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు.

‘ఇండియా బ్లాక్‌కు కన్వీనర్‌ను కూడా మేం నియమించలేకపోయాం. ఇది మంచిది కాదు. కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్. సమావేశం ఏర్పాటు చేయడం ఆ పార్టీ బాధ్యత’ అని ఆయన అన్నారు. ‘ఒక కూటమిలో వ్యక్తిగత పార్టీల కార్యకర్తలకు అవకాశాలు లభించవు. ఇది సంస్థాగత వృద్ధిని అడ్డుకుంటుంది. ముంబై, థానే, నాగ్‌పూర్, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో మా సొంత బలంతో పోటీ చేస్తాం’ అని స్పష్టం చేశారు.
మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ ఓటమిపై నిందలు వేస్తున్న కాంగ్రెస్ నేత విజయ్ వాడేట్టివార్‌పై సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఏకాభిప్రాయం, రాజీపై నమ్మకం లేని వారికి కూటమిలో ఉండే హక్కు లేదని విమర్శించారు.