పూనమ్ కౌర్ తాజాగా నెట్టింట షేర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనంగా మారింది. అందులో ఆమె దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై చేసిన విమర్శలు పెద్ద చర్చకు దారితీశాయి. “త్రివిక్రమ్‌పై నేను ఫిర్యాదు చేసాను, కానీ మా అసోసియేషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు” అంటూ ఆమె తన బాధను వ్యక్తం చేసింది. అంతేకాకుండా, తన ఆనందం, ఆరోగ్యం, జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశారని, అతనికి ఇండస్ట్రీలోని ప్రముఖులు ఇంకా మద్దతు ఇస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. పూనమ్ తన ట్వీట్లో, త్రివిక్రమ్ వల్ల తన జీవితంలో వచ్చిన ఇబ్బందులను వివరిస్తూ, తన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదని మండిపడింది. “నన్ను న్యాయంగా రక్షించే ప్రయత్నం చేయలేదని” ఆమె తీవ్రంగా విమర్శించింది.

ఆమె ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల నిర్లక్ష్యం గురించి కూడా ప్రస్తావించింది. పూనమ్ కౌర్ ట్వీట్‌కు ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కూడా స్పందించింది. “మా దగ్గర పూనమ్ కౌర్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి రాతపూర్వక ఫిర్యాదు రాలేదు,” అని ‘మా’ కోశాధికారి శివబాలాజీ వెల్లడించారు. అంతేకాకుండా, “అసోసియేషన్‌ను ఆశ్రయించకుండా ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో ఉంచడం వల్ల సమస్యలు పరిష్కారం కావు,” అని ఆయన పేర్కొన్నారు.
న్యాయసేవలు తీసుకోవడం లేదా అసోసియేషన్‌కు అధికారిక ఫిర్యాదు అందించడం ద్వారా మాత్రమే తగిన చర్యలు తీసుకోవచ్చని శివబాలాజీ సూచించారు.‘మా’ అసోసియేషన్ నుంచి వచ్చిన ఈ ప్రకటనపై పూనమ్ ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. పూనమ్ ఇప్పటివరకు తన ఆరోపణలను స్పష్టంగా వివరించలేదు. ఆమె గతంలోనూ సోషల్ మీడియాలో పరోక్షంగా త్రివిక్రమ్‌పై విమర్శలు చేసినప్పటికీ, ఈసారి మాత్రం ఆయన పేరును స్పష్టంగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.త్రివిక్రమ్ మరియు పూనమ్ కౌర్ మధ్య గల అసలు వివాదం ఏంటో, వారి మధ్య ఎలాంటి విషయాలు జరిగాయో అనేది ఇప్పటికీ అనుమానంగానే ఉంది.